17, ఏప్రిల్ 2016, ఆదివారం

సూర్యనారాయణ స్వామి ఆలయం అరసవల్లి

సూర్యనారాయణ స్వామి ఆలయం

ఓం ఆదిత్యాయ నమః..అంటూ భక్తులు వేనోళ్ల పొగిడే దివ్య ఆదిత్య క్షేత్రం.. శ్రీకాకుళం సమీపంలోని అరసవల్లి సూర్యక్షేత్రం!
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం పట్టణానికి కేవలం 1 కి.మీ.దూరంలో ఉన్న అరసవల్లి-శ్రీ ఉషాపద్మినీ ఛాయాసమేత శ్రీ సూర్యనారాయణస్వామివారి దేవస్థానం దేశంలోని అతి ప్రసిద్ధ సూర్యదేవాలయాల్లో ఒకటి!

క్షేత్రచరిత్ర/ స్థల పురాణం: లోక కల్యాణార్థం దేవేంద్రుడు ఇక్కడ సూర్యనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథ. రథసప్తమి పర్వదినం రోజున ఇక్కడ విశేష ఉత్సవం నిర్వహిస్తారు. కళింగ శిల్పశైలిలో ఉండే స్వామివారి ప్రధాన దేవాలయంలోని అయిదు ద్వారాల నుంచి ఏటా రెండుసార్లు(మార్చి 9 నుంచి 12 వరకు.., అక్టోబర్‌ 1, 2, 3 తేదీల్లో ఉదయం) సూర్యకిరణాలు నేరుగా స్వామివారి విగ్రహాన్ని స్పృశించడం గొప్ప విశేషం! ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారు.


ఆదిత్యుని దర్శన సమయాలు: ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ ఉంటుంది. అనంతరం ఉదయం 5.30 గంటలకు నిత్యార్చన నిర్వహించి.. ఆ తర్వాత 6 గంటల నుంచి 12.30 గంటల వరకూ భక్తులందరికీ దర్శనానికి అనుమతిస్తారు.
మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల మధ్య మహా నైవేద్యం.. దర్శనం ఉండదు. తిరిగి మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. 2 గంటల నుంచి 3.30 గంటల మధ్య స్వామివారికి పవళింపు సేవ. దర్శనానికి విరామం. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ దర్శనానికి అనుమతిస్తారు.
ఇక్కడ భక్తులందరికీ స్వామివారి దర్శనం ఉచితం. కాస్త త్వరగా దర్శనం చేసుకోవాలనుకునేవారికి మాత్రం ఒక్కొక్కరికి రూ. 25 చొప్పున రుసుం వసూలు చేసి.. త్వరితంగా దర్శన అవకాశం కల్పిస్తారు.
ప్రత్యేకపూజలు: అష్టోత్తర శత నామార్చన, క్షీరాన్న భోగం, క్షీరాభిషేక సేవ, తిరువీధి సేవ, కల్యాణ సేవ, సూర్య నమస్వాక సేవ, శాశ్వత అన్నదానం.
రథసప్తమి పర్వదినం: ఈ రోజున రాష్ట్రం నలుమూలల నుంచే కాక.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు. స్వామివారికి త్రిచ, సౌర, అరుణ ప్రయుక్తంగా సూర్య నమస్కార పూజలు, అష్టోత్తర శత సహస్ర నామార్చనలు నిర్వహిస్తారు.
ఏటా సంక్రాంతి రోజున క్షీరాభిషేకం, ఏకాదశి నాడు కల్యాణసేవ, ప్రతి ఆదివారం తిరువీధిసేవ నిర్వహిస్తారు. ఆయా సేవల్లో పాల్గొనదలిచిన భక్తులు నిర్దేశిత రుసుంకు అదనంగా రూ. 5 పోస్టేజి కలిపి ఆ మొత్తాన్ని ఎం.ఓ. లేదా డీడీ రూపంలో పంపించాలి. ఆ మేరకు ఆయా సేవలు చేయించి దేవస్థానం తిరిగి ప్రసాదం పంపిస్తారు. ఎం.ఓ కూపన్‌లో సరైన చిరునామా, గోత్రం వివరాలు రాయాలి.
ఆదిత్యుడికి జరిపే వివిధ పూజలు.. విశేష సేవల వివరాలు
అష్టోత్తర శతనామార్చన: రూ.20
క్షీరాన్న భోగం: రూ.50
క్షీరాభిషేక సేవ: రూ. 216
తిరువీధి సేవ: రూ. 500
కల్యాణ సేవ: రూ. 500
సూర్యనమస్కారాలు: రూ.50
అన్నదానం(పదిమందికి): రూ.150
కల్యాణాలు, క్షీరాభిషేకాలు: ప్రతినెలా ఏకాదశి పర్వదినాల్లో స్వామివారి ఉత్సవమూర్తులకు కల్యాణం నిర్వహిస్తారు. ప్రతినెలా వచ్చే మాస సంక్రమణం రోజున స్వామికి క్షీరాభిషేకం చేస్తారు.
సూర్యకిరణాలు: ప్రతి ఏడాది మార్చి 7, 8, 9, 10, అక్టోబరు 1, 2, 3, 4 తేదీల్లో సూర్యకిరణాలు స్వామివారిని తాకుతాయి.
సూర్యనమస్కారాలు: రోజూ రూ. 50 చెల్లిస్తే కుటుంబం పేరు మీద అర్చకులు సూర్యనమస్కారాల సేవ చేస్తారు.
రవాణా సౌకర్యం: కోల్‌కతా- చెన్నై జాతీయ రహదారిపై ఉన్న నేపథ్యంలో రోడ్డుమార్గంలో శ్రీకాకుళానికి చేరడం చాలా సులభం. అలాగే శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌ నుంచి 13కి.మీ.ల దూరంలో ఉన్నందున రైలు మార్గంలోనూ సులభంగానే అరసవల్లికి చేరుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం బస్‌స్టేషన్‌ నుంచి కేవలం 3 కి.మీ. దూరంలో అరసవెల్లి క్షేత్రం ఉంది. బస్టాండ్‌ నుంచి ప్రతి 10 నిమిషాలకూ ఒక బస్సు చొప్పున రవాణా సౌకర్యముంది. అలాగే శ్రీకాకుళం రోడ్‌(ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌ నుంచి ఆర్టీసీ/ ప్రైవేటు బస్సులు.. క్యాబ్‌లు.. ఆటోల సౌకర్యముంది. 100 కి.మీల. దూరంలోని విశాఖపట్నం విమానాశ్రయం ద్వారా కూడా శ్రీకాకుళానికి చేరుకోవచ్చు.
శ్రీకాకుళం పట్టణం జిల్లాకేంద్రంగా ఉన్న నేపథ్యంలో.. చాలా ప్రభుత్వ.. ప్రైవేటు వసతిగృహాలు.. అద్దెగదులు అందుబాటులో ఉంటాయి. లేకుంటే విశాఖపట్నం నగరం నుంచి కేవలం 2 గంటల్లో వెళ్లొచ్చు కనుక అక్కడి నుంచైనా రాకపోకలు సాగించొచ్చు. వసతికి ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది లేదు.
వసతి.. ఇతర సౌకర్యాలకు సంబంధించి మరిన్ని వివరాలకు..
ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌..
శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం
అరసవల్లి-శ్రీకాకుళం(జిల్లా)- 532 401
ఫోన్‌ : 08942 222421
వారిని లేదా.. శ్రీసూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.


source : EENADU 

13, జనవరి 2016, బుధవారం

నాన్నకి ప్రేమతో..



ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి. ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు (భోగి, మకర సంక్రమణం, కనుమ) ఇతర ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగోరోజు ముక్కనుమ ) జరుపతారు కావున దీన్ని పెద్ద పండుగ అంటారు.
మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతాయి. బుడబుక్కలవాళ్లు, పగటివేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. ఈ పండుగకు దాదాపు నెలరోజుల ముందునుంచే - ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మ లతో అలంకరిస్తారు. ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు. కళ్లం నుంచి బళ్ల మీద ధాన్యం బస్తాలు వస్తూ ఉంటాయి. భోగినాడు భోగిమంట విధిగా వేయవలసిందే. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్లు తప్పవు. ఈ పెద్ద పండుగకు కొత్త అల్లుడు తప్పనిసరిగా అత్తవారింటికి వస్తాడు. మరదళ్ల ఎకసెక్కాలకు ఉడుక్కుంటాడు. కోడి పందాలు, ఎడ్ల బళ్ళ పందాలు జరుగుతాయి. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు.

ఉత్తరాయణ పుణ్యకాలం :
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయనము.కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గరినుండీ మొదలై, ఆ తరువాత సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనూ రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయణము. మానసికమైన అర్చనకు, ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయణము. పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము.
కనుకనే ఉత్తరాయనము వరకూ ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు.

మా నాన్న గారు ఈ పుణ్య ధినమున పరమపధించి 19 సంవత్సరాలు ఐనా ఇంకా మాతోనే ఉన్నట్లనిపించే అనిర్విచయిమైన అనుభూతి..   

ఆ పుణ్యమూర్తి ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్దిస్తూ..


-- వేణు, కాశి & శివ  

25, సెప్టెంబర్ 2015, శుక్రవారం

Power of Relations
సాధారణంగా మనమందరం నేను చేసిన కృషి ఫలితంగానే విజయం సాధించాను. లేదా నా కృషి ఫలితంగానే ఆపదలు తొలగిపోయాయి, గండాలు గట్టెక్కాయి అని అనుకుంటూ ఉంటాము.
కాని ఆథ్యాత్మిక దృక్కోణంలో చూసినపుడు వాటి వెనుక కనిపించని అనుగ్రహాలు, కారణాలు కూడా ఉంటాయి.

ఉదాహరణగా క్రింది కథను చదవండి. కద పాతదైనా సంధోర్బిచితం.

                🔯 🔯 🔯

చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది.




ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు 30 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు. చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు.



బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో పిడుగు బస్సుకు 20 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 10 అడుగుల దగ్గరలో కొట్టింది. బస్సులో ఉన్న వాల్లందరూ రెప్పపాటులో పిడుగు ప్రభావం అనుభవించి భయకంపితులైనారు.  

ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.
అందులోంచి ఒక పెద్దమనిషి ఇలా అన్నాడు.
"చూడండీ! మనందరిలో రోజు 'పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి 'ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది.
నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!
బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి, అదిగో! ఎదురుగా ఉన్న చెట్టును ముట్టుకుని మళ్లి బస్సులో వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు! ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ! " అన్నాడు.

చివరకు ఒక్కొక్కరుగా వెళ్లి చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు.

మొదట పెద్దమనిషే మనుసులో చాలా భయపడుతూనే వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు.ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు.

... ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు.

చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు.ఇక మరణించేది అతడే! అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది. చాలా మంది అతని వైపు అసహ్యంతో,కోపంతో చూడసాగారు. కొందరు జాలి పడుతూ చూడసాగారు. అతను కూడా భయపడుతూ బస్సు  దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు. కాని, బస్సులోని ప్రయాణికులందరు "నీవల్ల మేమందరం మరణించాలా? వీల్లేదు. " అంటూ బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు.

చేసేది లేక చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు.

వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది.
.
.
.
.
కాని పిడుగు వచ్చి కొట్టింది చివరి వ్యక్తిపై కాదు!

అందరు ఉన్న బస్సుపై...
.
.
అవును.. బస్సుపై పిడుగు పడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు.

నిజానికి చివరి వ్యక్తి బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు బస్సు కు ప్రమాదం జరగలేదు.ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు వారినందరిని కాపాడింది.

                🔯 🔯 🔯




కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ, క్రెడిటంతా మనదేననుకుంటాము. కాని, పుణ్యఫలం మన తల్లిదండ్రులది కావచ్చు! జీవిత భాగస్వామిది కావచ్చు! పిల్లలది కావచ్చు! తోబుట్టువులది కావచ్చు! మన క్రింద పని చేసే వారిది కావచ్చు! లేదా మన శ్రేయస్సును కోరే స్నేహితులది - బంధువులది కావచ్చు!

మనం రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు. ఎంతో మంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం, వారు వారి  అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి.

ఒక సినిమాలో చెప్పినట్లు...

"బాగుండడం" అంటే బాగా ఉండడం కాదు. అందరితో కలిసి ఆనందంగా ఉండడం.

ü  ఒక్కరుగా మనం ఆలోచించగలము, పలుకగలము అంతే! కాని, అందరుగా ఆలోచనలను పంచుకోగలము, మాట్లాడగలము .
ü  ఒక్కరుగా "ఎంజాయ్ " చేయగలము అంతే! కాని,అందరుగా "సెలబ్రేట్ " చేసుకోగలము.
ü  ఒక్కరుగా మనసులోనే నవ్వుకోగలము. కాని, అందరితో మనస్పూర్తిగా నవ్వును పంచుకోగలము - పెంచుకోగలము.
ü  That's the BEAUTY and Power of Human Relations.

ఇదే సనాతన ధర్మం మనకిచ్చే సందేశం.

   సర్వే జనా: సుఖినోభవంతు!    సమస్త సన్ మంగళాని భవంతు!
   ఓం  శాంతి  !శాంతి ! శ్శాంతి !

   స్వస్తి

 (ఓపికగా చదివిన వారికి మరియు శ్రీను అన్నయకి ధన్యవాదములతో)



-          మీ విసు

Sankranthi

Sankranthi
Sankranthi Wishes